శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌‌ ద్వారా చంద్రయాన్-2 మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో చంద్రయాన్-2 మాడ్యూల్‌ను రోదసిలోకి పంపించారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. తోటి శాస్త్రవేత్తలతో కరచాలనం చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్ షార్‌కు వెళ్లారు. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

వాస్తవానికి ఈ నెల 15వ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్‌-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన ఆధీనంలోకి తీసుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here