వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే నేను.. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా… అనే ప‌దాల‌ను అశేష జ‌న‌వాహిని స‌మ‌క్షంలో ప‌లికేందుకు వైఎస్ జ‌గ‌న్ శ్వాసించాడు. స్వ‌ప్నించాడు. ప‌రిత‌పించాడు. అదే ల‌క్ష్య‌మై ముందుకు సాగాడు. దీక్ష‌లా, య‌జ్ఞంలా సాగిపోతే ఏ నాటికైనా, ఎంత‌టి ల‌క్ష్య‌మైనా ఒడి చేరుతుంద‌ని నిరూపించి పలువురికి ఆద‌ర్శంగా నిలిచాడు. 

నా అనే వాళ్లు, నా అనే వ్య‌వ‌స్థ‌లు అన్నీ అత‌డిని వెలేశాయి. చిన్న‌గా అత‌డే వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మించుకోవ‌డం మొద‌లు పెట్టాడు. అత‌డే నాయ‌కుల‌ను త‌యారుచేయ‌డం మొద‌లుపెట్టాడు. ఆటుపోట్లు, ఎదురుదెబ్బ‌ల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డ్డాడు. చివ‌రికి విజ‌యం సాధించాడు.

అత‌డిని వెలేసిన మ‌నుషులు, వ్య‌వ‌స్థ‌లన్నీ ఇప్పుడు అత‌డిని కీర్తిస్తున్నాయి. అత‌డి క‌ర‌చాల‌నం కోసం, అత‌డి ఆలింగ‌నం కోసం అర్రులు చాస్తున్నాయి. విజ‌యం అంటే ఇది.. మ‌న‌ల్ని చిన్న‌చూపు చూసిన వాళ్లు మ‌న వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్ట‌డం అస‌లైన విజ‌యం. జ‌గ‌న్ అది సాధించాడు. స‌గ‌ర్వంగా విజేత‌గా త‌లెత్తి నిల‌బ‌డ్డాడు. త‌న‌ను దుర్భాష‌లాడిన నోళ్ల‌ను … వెక్కిరించిన నొస‌ళ్ల‌ను … ఘ‌ర్ష‌ణ‌గా చూసిన క‌ళ్ల‌ను … ఇలా అన్నింటిని ఇప్పుడు త‌న ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

కృషి, ప‌ట్టుద‌ల‌, ధైర్యం ఉంటే ల‌క్ష్యం ఎంత పెద్ద‌ద‌యినా ద‌రి చేరుతుంద‌ని నిరూపించిన వ్యక్తి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తండ్రి మరణానంతరం కొన్ని పరిస్థితుల వల్ల తాను సొంతంగా పార్టీ పెట్టుకోవాల్సి వ‌చ్చింది. దీన్ని ధిక్కారంగా భావించిన హ‌స్తిన సేన దాడికి దిగింది. ఇంకొక‌డైతే ఢిల్లీ పీఠానికి త‌ల‌వంచి స‌లాం కొట్టేవాడే… కానీ అత‌డు జ‌గ‌న్‌. రోజుకో సీబీఐ కేసు, పూట‌కో చోట ఈడీ దాడులు, గంట‌కో భ‌య‌పెట్టే వార్త‌, వారానికొక చార్జిషీటు, విచార‌ణ‌లు, కోర్టులు, అరెస్టులు, 18 నెల‌ల‌పాటు జైలులోనే నిర్బంధ‌ం, మీడియా ఉగ్ర‌రూపం… వీట‌న్నింటినీ జ‌గ‌న్ భ‌రించాడు. దిగ‌మింగాడు.

చిన్న‌ క‌ష్టానికే ఆత్మహత్యల వైపు వెళుతున్న ఇవాళ్టి యువ‌త జ‌గ‌న్ పోరాటాన్ని క‌చ్చితంగా చ‌ద‌వాల్సిందే. క‌ష్టాన్ని బ‌య‌ట‌కు క‌నిపించ‌నీయ‌ని అత‌డి నైజం, పెనుస‌వాళ్లు ముసురుకున్నా చెర‌గ‌ని అత‌డి చిరున‌వ్వు, ఏనాడూ, ఎవ‌డికీ త‌లొగ్గ‌ని తెగువ‌… ఇవ‌న్నీ ఎప్ప‌టికీ అంద‌రికీ ఆదర్శ‌నీయ అంశాలే.

కాంగ్రెస్‌పార్టీ వైఎస్ జ‌గ‌న్‌కు భ‌విష్య‌త్తు లేకుండా చేయాల‌ని భావించింది. అందుకోసం ఢిల్లీ స్థాయిలో చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చివ‌రికి ఏమైంది…? నేడు కాంగ్రెస్‌ పార్టీ నేల‌మ‌ట్ట‌మైంది. జ‌గ‌న్‌ను అస‌లు ప్ర‌తిప‌క్ష‌నాయకుడిగా చూడ‌టానికి తెలుగుదేశం పార్టీ ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్పుడేమైంది. ఆ ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌డానికి కూడా టీడీపీ నానా తంటాలు ప‌డింది. అంత‌కంత‌కూ ఎదుగుతూ వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్ పై హత్యాయ‌త్నం జ‌రిగిన రోజు సైతం అతడి మొఖంలో క‌నిపించింది చిరున‌వ్వే త‌ప్ప భ‌యం కాదు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎవ‌రికీ త‌ల‌వంచ‌కుండా, ఓర్పుగా, ధైర్యంతో, ప‌ట్టుద‌ల‌తో, దీక్ష‌తో, పౌరుషంతో, వీర‌త్వంతో, ప్ర‌జ్ఞ‌తో, విజ్ఞ‌త‌తో, విన‌యంతో, త‌ప‌న‌తో, కృషితో, క‌ష్టంతో, శ్ర‌మ‌తో, నిరాడంబ‌ర‌త్వంతో, నిష్ట‌తో, నిర్మ‌లంతో, జ‌న‌కుడి ఆశిస్సుల‌తో, న‌వ్వుతో, చిరున‌వ్వుతో, తెగువ‌తో, సాహ‌సంతో, తెలివితో, చురుకుతో, నేర్పుతో, ప్ర‌తిభ‌తో, స్వీయ‌ స‌త్తాతో….విజయం దిశగా వెళ్ళాడు. గెలుపు ఆయ‌న‌కు మంచి మార్కులే వేసింది. డిస్టెన్ష‌న్‌లో పాస‌య్యేలా చేసింది.

వైఎస్ జ‌గ‌న్ జీవితం నేటి యువ‌త‌కు ఓ మంచి పాఠం. క‌ష్టాలు, క‌న్నీళ్లు వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోకుండా పోరాడితే గెలుపు దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పేందుకు అత‌డి జీవితం నిద‌ర్శ‌నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here