కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం తప్పేనని.. ఇందుకు రాహుల్‌ చింతిస్తున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి రాహుల్‌, కోర్టును క్షమాపణ కోరినట్లే అని అర్థ చేసుకోవాలంటూ అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. దీంతో క్షమాపణలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు న్యాయస్థానం రాహుల్‌కు మరో అవకాశం కల్పించింది. గతంలో రాహుల్‌ గాంధీ.. రాఫెల్‌ కుంభకోణంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ అని కోర్టే చెప్పిందంటూ.. తన వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించారు. ఈ నేప‌ధ్యంలో రాహుల్ సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి రాహుల్‌ గాంధీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాఫెల్‌ డీల్‌ కేసులో చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యానం తాను ఎప్పుడు చేయలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రఫేల్‌ తీర్పులో తాము ఎక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుగా తమకు ఆపాదించారని స్పష్టంచేసింది. దానిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాహుల్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సదరు వ్యాఖ్యలపై ‘విచారం వ్యక్తం చేస్తున్నట్లు అఫిడవిట్‌లో వెల్ల‌డించారు. అయితే విచారం అనే మాటను బ్రాకెట్‌లో ఉంచారని మీనాక్షి తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. రాహుల్‌పై నేరపూరిత కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దానిపై కోర్టు రాహుల్‌కు ఈ నెల 23న నోటీసులిచ్చింది. ఈ నోటీసులకు స్పందించిన రాహుల్.. మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే అందులోనూ పాత అంశాలనే చెప్పారు. తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here