నటీనటులు: మమ్ముట్టి – జగపతి బాబు – రావు రమేష్ – అనసూయ భరద్వాజ్ – సచిన్ ఖేద్కర్ – సుహాసిని – పోసాని కృష్ణమురళి – అశ్రిత వేముగంటి తదితరులు
సంగీతం: కే
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి
రచన – దర్శకత్వం: మహి.వి.రాఘవ్

దేశవ్యాప్తంగా బయోపిక్స్ హవా నడుస్తోందిప్పుడు. ‘మహానటి’ తర్వాత తెలుగులోనూ ఈ ఒరవడి పెరిగింది. ఇటీవలే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా చూశాం. ఇప్పుడు మరో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 ఎన్నికలకు ముదు నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల్ని చూపించడంతో మొదలవుతుందీ కథ. అప్పటి చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందస్తుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్న భావనతో ఉంటారు. అలాంటి సమయంలో అసలు జనం సమస్యలేంటో.. వాళ్లు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలుపెడతాడు. ఈ యాత్రలో జనం నాడిని వైఎస్ ఎలా పట్టుకున్నాడు.. వాళ్ల అభిమానాన్ని ఎలా చూరగొన్నాడు.. ఈ యాత్ర 2004 ఎన్నికల్లో గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ఎలా దోహదపడింది అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

‘యాత్ర’ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో అత్యత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ మాత్రమే. కేవలం ఈ యాత్ర చుట్టూ కథ అల్లి సినిమాగా తీయాలనుకోవడం సాహసమే. ఇందులో వైఎస్ ను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారన్నది ఊహించిన విషయమే. ఐతే సినిమాగా తీయడానికి.. మెప్పించడానికి అనేక పరిమితులున్న ఈ కథను ఎంత మేరకు కన్విన్సింగ్ తెరపై ప్రెజెంట్ చేస్తారన్న విషయంలో ప్రేక్షకుల్లో సందేహాలున్నాయి. వైఎస్ మీద ఎవరికెలాంటి అభిప్రాయాలున్నాయి.. ఈ సినిమా ఏ ఉద్దేశంతో తీశారు అన్న విషయాలు పక్కన పెట్టి.. రాజకీయ కోణంలో కాకుండా మామూలుగా చూస్తే ‘యాత్ర’ సగటు ప్రేక్షకుడికి ఇది ఎలాంటి భావన కలిగిస్తుందన్నది కీలకమైన విషయం. ఈ విషయంలో ‘యాత్ర’ పాస్ మార్కులు వేయించుకుంటుంది. ‘యాత్ర’ను ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మహి.వి.రాఘవ్ విజయవంతం అయ్యాడు. తెలిసిన విషయాల్నే ప్రభావవంతంగా తెరమీద చూపించాడతను. వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించడం.. ఆ పాత్రలో ఆయన అద్భుత అభినయం ప్రదర్శించడం సగటు ప్రేక్షకుల్ని మెప్పించే విషయం.

పాదయాత్ర ద్వారా వైఎస్ ఒక నాయకుడిగా ఎలా పరిణామం చెందాడన్న విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ‘యాత్ర’. వైఎస్ అమలు చేసిన ప్రధానమైన సంక్షేమ పథకాల ఆలోచన ఎలా పుట్టిందో తెర మీద ప్రభావవంతంగా చూపించాడు మహి.వి.రాఘవ్. వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు ఎంత దయనీయ స్థితికి చేరిన వైనాన్ని చూసి చలించిపోయి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం.. ఆసుపత్రిలో ఒక చిన్నారి మరణానికి కదిలిపోయి ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడం.. ఇంకా ఫీజు రీఎంబర్స్ మెంట్ అర్హులందరికీ పింఛను లాంటి పథకాల దిశగా వైఎస్ అడుగులు వేయడం లాంటి విషయాల్ని ‘యాత్ర’లో హైలైట్ చేశాడు. వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు కథను నడిపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని.. వైఎస్ వ్యక్తిత్వాన్ని చూపిస్తూ సాగే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ‘యాత్ర’ డాక్యుమెంటరీ మోడ్ లోకి వెళ్లిపోతుంది. వైఎస్ జీవితాన్ని పూర్తిగా చూపించినట్లయితే.. డ్రామాకు అవకాశం ఉండేది. పాదయాత్ర కారణంగా వైఎస్ ఎలా పరిణామం చెందాడని మాటలతో చెప్పారు కానీ.. అంతకుముందు వైఎస్ ఎలాంటి వాడు.. ఎంత మొండిగా ఉండేవాడు అనే విషయాల్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని వల్ల ఈ పరిణామాన్ని ప్రేక్షకులు పెద్దగా ఫీలవ్వరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here