నటీనటులు: రజనీకాంత్ – సిమ్రన్ – త్రిష – విజయ్ సేతుపతి – నవాజుద్దీన్ సిద్ధిఖి – బాబీ సింహా – శశికుమార్ – మేఘా ఆకాశ్ – నరేన్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: తిరు
నిర్మాత: వల్లభనేని అశోక్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

లేటు వయసులో స్పీడుగా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ‘2.0’ వచ్చిన రెండు నెలల్లోపే ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘పిజ్జా’.. ‘జిగర్ తండ’ లాంటి సినిమాలతో సత్తా చాటిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కాళి (రజనీకాంత్) పెద్ద రెకమండేషన్ మీద హిల్ స్టేషన్లోని ఒక కాలేజీ హాస్టల్ వార్డెన్ గా వస్తాడు. అప్పటిదాకా అస్తవ్యస్తంగా ఉన్న ఆ హాస్టల్ కాళి రాకతో మొత్తం మారిపోతుంది. ఆ కాలేజీని పట్టి పీడిస్తున్న రౌడీ గ్యాంగ్ ఆట కట్టించిన కాళి.. అక్కడే చదువుకుంటున్న అన్వర్ అనే కుర్రాడి మీద ప్రత్యేక దృష్టి సారిస్తాడు. అతడి ప్రేమకు సాయం కూడా చేస్తాడు. ఐతే కాళి ఆ కాలేజీకి రావడానికి.. అన్వర్ కు సాయం చేయడానికి వేరే కారణాలుంటాయి. అన్వర్ మీద ఒక గ్యాంగ్ దాడి చేయడం.. వాళ్ల నుంచి అన్వర్ ను కాళి కాపాడటంతో అతడి గతం బయటికి వస్తుంది. ఇంతకీ కాళి ఎవరు.. అతడి గతమేంటి.. అతడికి అన్వర్ కు సంబంధమేంటి అన్నది తెర మీదే చూడాలి.

కథనం – విశ్లేషణ:

‘పేట’లో ఒక సన్నివేశంలో రజనీ ఒక మార్కెట్లోకి అడుగు పెట్టగానే తన కోసం రౌడీలు స్కెచ్ వేసిన విషయాన్ని కని పెట్టేస్తాడు. వాళ్లనుద్దేశించి.. ‘‘ఇంకా ఎన్ని రోజులురా.. అవే గుండ్లు వేసుకుని ఒక మూలన నక్కి నక్కి చూస్తూ ఎటాక్ చేయడానికి ట్రై చేస్తారు’’ అంటూ ఒక డైలాగ్ కొడతాడు. ‘పేట’ సినిమా చూస్తున్నంతసేపూ కూడా ప్రేక్షకులకు ఇదే తరహాలో ఫ్రస్టేట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. హీరో వీరాధి వీరుడు.. ఒక ఏరియాలో రౌడీ గ్యాంగును ఎదిరించి ఆ ప్రాంత ప్రజలకు దేవుడిగా మారతాడు. విలన్ గ్యాంగ్ అతడి వాళ్లందరినీ మట్టు బెడుతుంది. హీరోతో పాటు ఒకరిద్దరు మిగులుతారు. ఇక్కడ కట్ చేస్తే ఒక ఇరవై ఏళ్ల తర్వాత హీరో కుటుంబంలో మిగిలిన వాళ్లకు ఆపద వస్తుంది. హీరో రీఎంట్రీ ఇస్తాడు. వాళ్లను కాపాడి విలన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. రజనీకాంత్ ఏ కేఎస్ రవికుమార్ లాంటి దర్శకుడితోనో సినిమా తీసి ఉంటే కథ ఇలా నడిస్తే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ ‘పిజ్జా’.. ‘జిగర్ తండ’ లాంటి వైవిధ్యమైన.. సెన్సేషనల్ సినిమాలు తీసిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు కాబట్టి కొత్తదనం ఆశించడం ప్రేక్షకుల తప్పుకాదు. కానీ అతను కూడా రొటీన్ దారిలో నడుస్తుంటే.. ‘‘ఇంకా ఎన్ని రోజులిలా రొటీన్ కథలతో బండి లాగిస్తారు’’ అని అసహనం చెందకుండా ఉండలేం.

‘పేట’ ఆడియో వేడుకలో కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పుకొచ్చాడు. ‘దిస్ ఫిలిం ఈజ్ ఇన్ స్పైర్డ్ బై.. పెర్ఫామ్డ్ బై.. అండ్ డెడికేటెడ్ టు రజనీకాంత్’ అని. 80లు.. 90ల్లో తన స్టయిల్ తో.. మేనరిజమ్స్ తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన వింటేజ్ రజనీని మళ్లీ తెరపైకి తేవాలన్నది కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచన కావచ్చు. ఒక అభిమానిగా తాను రజనీని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించడానికి ప్రయత్నించాడు. కానీ కేవలం రజనీ మార్కు హీరోయిజం.. స్టైల్.. మేనరిజమ్స్.. ఫైట్లు.. స్టెప్పులు ఉంటే సరిపోదు కదా? రజనీని అభిమానులు కోరుకునే స్టయిల్లో చూపిస్తూనే ఏదైనా కొత్త కథను చెప్పే ప్రయత్నం చేయాల్సింది. అందులోనూ కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటిదాకా తీసిన సినిమాలు చూసిన అంచనాతో ప్రేక్షకులు కచ్చితంగా కొత్తదనం ఆశిస్తారు. సర్ప్రైజ్ కోరుకుంటారు. అవే ‘పేట’లో మిస్సయ్యాయి. స్టైల్ ఓవర్ సబ్ స్టన్స్ అంటూ ఒక మాట అంటుంటారు. ‘పేట’కు సరిగ్గా సరిపోయే క్యాప్షన్ ఇది.

దశాబ్దాలుగా చూస్తున్న రివెంజ్ కథనే ‘పేట’లో కొంచెం స్టైలిష్ గా చెప్పే ప్రయత్నం చేశాడు కార్తీక్ సుబ్బరాజ్. సినిమాలో ప్రత్యేకంగా కనిపించేది రజనీ మాత్రమే. గత సినిమాలతో పోలిస్తే కొంచెం వయసు తగ్గినట్లుగా.. మరింత ఉత్సాహంగా కనిపిస్తాడు సూపర్ స్టార్. ప్రతి సన్నివేశంలోనూ రజనీని స్టైలిష్ గా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు కార్తీక్. ఆయన నడిచినా.. డైలాగ్ కొట్టినా.. ఒక లుక్ ఇచ్చినా.. అన్నింట్లోనూ స్టయిలే. ఐతే స్క్రిప్టు రాసేటపుడు.. సినిమా తీసేటపుడు పూర్తిగా తన ఫోకస్ మొత్తం రజనీని స్టైలిష్ గా చూపించడం మీదే దృష్టిపెట్టాడో ఏమో కానీ.. తన స్టయిల్ ను పక్కన పెట్టేశాడు కార్తీక్. అతడి నుంచి ఆశించే చమక్కులు సినిమాలో కనిపించవు. ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో.. అంతా పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలా ఒక కొత్త ప్రదేశానికి వచ్చి అక్కడ అందరి మనసులూ గెలిచేయడం.. ఆ తర్వాత తన మిషన్ బయటపెట్టడం.. ఆపై ఫ్లాష్ బ్యాక్.. తర్వాత రివెంజ్.. ఇలా అంతా ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోతుంది ‘పేట’. కాకపోతే ప్రథమార్ధం లైటర్ వీన్ లో.. రజనీ మార్కు మాస్ మూమెంట్స్ తో సాగిపోవడం వల్ల కొంచెం టైంపాస్ అయిపోతుంది. ఫైట్లు.. పాటల్లో రజనీ తనదైన శైలిలో అలరిస్తాడు. అభిమానుల్ని మురిపిస్తాడు. ఐతే కథ పరంగా ఏమీ ఎగ్జైట్మెంట్ కలగదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here