చిత్రం : ‘ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’

నటీనటులు: వెంకటేష్-వరుణ్ తేజ్-తమన్నా-మెహ్రీన్ కౌర్-ప్రకాష్ రాజ్-రాజేంద్ర ప్రసాద్-ప్రియదర్శి-ప్రగతి-రఘు బాబు-వెన్నెల కిషోర్- వై.విజయ-అన్నపూర్ణ-అనసూయ-నాజర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి

సంక్రాంతి సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వెంకీ (వెంకటేష్) ఒక ఎమ్మెల్యే దగ్గర పీఏగా పని చేస్తుంటాడు. అతను ఒక మ్యాట్రిమొనీ ద్వారా వచ్చిన సంబంధం నచ్చి హారిక (తమన్నా)ను పెళ్లాడతాడు. పెళ్లయిన కొత్తలో అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ.. ఆ తర్వాత భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక పోతుంటాడు. ఇలాంటి సమయంలోనే హారిక చెల్లెలైన హనీ (మెహ్రీన్)ను ప్రేమించిన వరుణ్ (వరుణ్ తేజ్) వెంకీకి తోడవుతాడు. అతడికి పెళ్లి కాక ముందే హనీ నుంచి వేధింపులు మొదలవుతాయి. ఓ వైపు హనీతో తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా.. వెంకీతో కలిసి వరుణ్ యూరప్ టూర్ కు వెళ్లిపోతాడు. ఇలా అర్ధంతరంగా తమను విడిచి వెళ్లిపోయిన వెంకీ.. వరుణ్ లతో హారిక-హనీ ఎలా వ్యవహరించారు.. ఈ జంటలు మళ్లీ కలిశాయా లేదా అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సినిమా ‘పటాస్’.. ఆ తర్వాత తీసిన ‘సుప్రీమ్’.. ‘రాజా ది గ్రేట్’.. ఈ మూడింట్లోనూ కనిపించే కామన్ ఫ్యాక్టర్.. వాటికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం కామెడీ. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అనిల్.. కామెడీ పండించడంలో తన ప్రత్యేకతను ఆ మూడు సినిమాల్లోనూ చూపించాడు. అతను వినోదం పండించే తీరు మరీ కొత్తగా ఏమీ అనిపించదు. అలాగని మరీ ముతకగానూ అనిపించదు. మధ్యస్థంగా ఉండి అందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకునే పాత్రలు.. సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి.. షార్ప్ డైలాగ్స్ తో వినోదం పండిస్తాడతను. అలాంటి దర్శకుడు కామెడీ పండించడానికి ఎవర్ గ్రీన్ అనదగ్గ ‘భార్యా బాధితుడు’ పాత్ర చుట్టూ కథను రాసుకున్నాడు. పైగా ఆ పాత్రకు వెంకీ లాంటి సూపర్ కామెడీ టైమింగ్ ఉన్న నటుడిని ఎంచుకున్నాడు. ఇక వినోదానికి ఢోకా ఏముంది?

సరైన పాత్ర పడితే కామెడీ ఇరగతీసే వెంకీ.. చాన్నాళ్ల తర్వాత ఆ తరహా పాత్రే పడటంతో చెలరేగిపోయాడు. అనిల్ రైటింగ్.. వెంకీ టైమింగ్ సరిగ్గా కుదిరి ఒక దశ వరకు ‘ఎఫ్-2’ కడుపు చెక్కలయ్యేలా చేస్తుంది. సగం సినిమాకే టికెట్ డబ్బులు గిట్టుబాటు చేసేస్తుంది. కానీ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే టైటిల్ కు న్యాయం చేయడానికేమో అన్నట్లుగా.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘ఎఫ్-2’ మరీ సాధారణంగా తయారై ఫ్రస్టేట్ చేస్తుంది. రెండో అర్ధం ఓ మోస్తరుగా సాగినా కూడా ఒక స్థాయిలో నిలిచే అవకాశమున్న చిత్రాన్ని ఒక దశా దిశా లేకుండా మరీ సిల్లీగా నడిపించడం.. ఇల్లాజికల్ సీన్లతో టైంపాస్ చేయడానికి ప్రయత్నించడంతో ద్వితీయార్దంలో గ్రాఫ్ పడిపోయి ఒక సగటు సినిమాలాగే ముగుస్తుంది ‘ఎఫ్-2’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here