మహిళల క్రికెట్‌లో దూసుకెళ్తున్న డాషింగ్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానా. ధనాధన్‌ క్రికెట్‌లోనూ డైనమైట్‌లా పేలుతూ.. పరుగుల వరద పారిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీ్‌సలో స్మృతి దెబ్బకు తమ సొంతపిచ్‌లపైనే కివీస్‌ బౌలర్లు గతి తప్పారు. మూడు మ్యాచ్‌ల్లో 180 పరుగులతో సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. వన్డే స్పెషలిస్టుగా జట్టులోకి వచ్చిన మంధానా.. గత రెండేళ్లలో కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌తో ముందుకెళ్తూ ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ఎదుగుతోంది. పరిణతి చెందిన ఆటతో.. భారత మహిళల జట్టుకు మూలస్తంభంగా మారుతోంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): భారత మహిళా క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మృతి మంధానా. డేరింగ్‌, డాషింగ్‌ ప్లేయర్‌ అయిన స్మృతి.. అనతి కాలంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. కొన్ని నెలల వరకు వన్డే క్రికెటర్‌గానే గుర్తింపు పొందిన మంధానా.. ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీ్‌సలో పరుగుల వరద పారించిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌వుమన్‌ మంధానా.. సగటు 60.00తో 180 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 146.34 స్ట్రయిక్‌ రేట్‌తో అదరగొట్టింది. క్లిష్టపరిస్థితుల్లోనూ ఓపెనర్‌గా కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొనడం మంధానా ప్రతిభకు నిదర్శనం. 2018కు ముందు.. ఆ తర్వాత చూస్తే మంధానా ఆటలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 2018 ఆరంభం నుంచి చూస్తే పొట్టి ఫార్మాట్‌లో జోరందుకున్న స్మృతి.. సుజీ బేట్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సోఫీ డివైన్‌ లాంటి వారిని వెనక్కునెట్టి అగ్రస్థానంలో దూసుకెళుతోంది. 32.08 సగటుతో 802 పరుగులు సాధించింది. అందులో ఏడు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. 2018 వరకు మంధానా 17.66 సగటుతో 50 పరుగులు మాత్రమే చేసింది. ఇటీవలి కాలంలో మాత్రం ఆమె ఆటలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వేగంగా పరుగులు సాధించగలిగే తన టాలెంట్‌ను మరింతగా మెరుగుపరచుకుంది. వన్డేల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. 2018 నుంచి వన్డేల్లో రెండు శతకాలు, ఎనిమిది హాఫ్‌ సెంచరీలు చేసిన మంధానా.. 72.08 సగటుతో 865 పరుగులు సాధించింది. అంతకు ముందు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆమె సగటు 30.09 మాత్రమే..!
పోరాడే నైజం..
ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల 2017 వరల్డ్‌క్‌పలో భారత్‌ ఫైనల్‌ చేరిందంటే.. అందుకు మంధానా అద్భుత బ్యాటింగ్‌ కూడా కారణం. మెగా టోర్నీలో రాణించడం మంధానా ఆటను, దృక్పథాన్ని మరింతగా మార్చివేసింది. తన వికెట్‌ విలువను గుర్తించిన స్మృతి.. ధాటిగా ఆడుతూనే విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారింది. క్లిష్టపరిస్థితుల్లో కూడా వెరవకుండా పోరాడడం స్మృతి ప్రత్యేకత. కివీస్‌ బౌలర్లను వారి సొంత పిచ్‌లపైనే ఆటాడుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో 58, 36, 86 పరుగులతో అద్భుత ఫామ్‌ను కనబరిచింది. మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడడం కూడా మంధానా ఆటలో మార్పు తెచ్చింది. స్మృతి అంటే.. జట్టుకు భరోసా అనే ముద్రను సంపాదించుకుంది.
దగ్గర్లోనే సెంచరీ..!
ఇక స్మృతి ముందున్న లక్ష్యం టీ20ల్లో సెంచరీ సాధించడమే! పొట్టి ఫార్మాట్‌లో 8 అర్ధ శతకాలు బాదినా.. శతకం అందుకోలే పోయింది. ఆమె స్ట్రయిక్‌ రేట్‌ కూడా 118.11 చేరడంతో మూడంకెల మార్క్‌కు మంధానా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here