• రాణించిన మయాంక్‌
  • రెస్టాఫ్‌ ఇండియా 330 ఆలౌట్‌
నాగ్‌పూర్‌: ఇరానీ ట్రోఫీలో రంజీ విజేత విదర్భపై రెస్టాఫ్‌ ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగు టెస్ట్‌ క్రికెటర్‌ హనుమ విహారి (211 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) సెంచరీతో విజృంభించడంతో.. తొలి రోజైన మంగళవారం రెస్టాఫ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (95) ఐదు రన్స్‌తో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (15) స్వల్ప స్కోరుకే అవుటైనా.. మయాంక్‌తో కలిసి విహారి రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నాడు. అయితే టాపార్డర్‌లో కెప్టెన్‌ అజింక్యా రహానె (13), శ్రేయస్‌ అయ్యర్‌ (19) విఫలమయ్యారు. లోయరార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ (2), కృష్ణప్ప గౌతమ్‌ (7), ధర్మేంద్రసిన్హ్‌ జడేజా (6) కూడా నిరాశపర్చారు. దీంతో రెస్టాఫ్‌ 72 పరుగుల తేడాతో ఐదు వికెట్లను కోల్పోయింది. ఒక్కో బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూకడుతున్నా.. విహారి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని శతకం పూర్తి చేశాడు. అలాగే టెయిలెండర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ (25) సహకారంతో జట్టు స్కోరును 300 దాటించాడు. చివర్లో రాహుల్‌ చాహర్‌ (22) కీలక రన్స్‌ చేశాడు. విదర్భ బౌలర్లలో ఆదిత్య సర్వాటే, అక్షయ్‌ వఖారే మూడేసి వికెట్లు పడగొట్టగా.. రజ్‌నేష్‌ 2, యశ్‌ ఠాకూర్‌, అక్షయ్‌ కర్నేవర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here