ప్రముఖ భోజ్‌పురి నటి అక్షరాసింగ్ పాల్గొన్న కార్యక్రమంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. సూర్య మహోత్సవ్ సందర్భంగా అక్షరాసింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధికంగా జనం హాజరయ్యారు. ఈ నేపధ్యంలో కొందరు కుర్చీలను విరగ్గొట్టారు. ఈ గందరగోళంలో కొందరు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో రాళ్ల దాడి చోటుచేసుకుంది. ఫలితంగా కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది. కాగా ఈ అల్లర్లు జరగకముందే నిర్వాహకులు కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. అయితే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయలేదు. దీనికితోడు కార్యక్రమానికి లెక్కకుమించి జనం హాజరయ్యారు. వీరందరికీ కార్యక్రమం చూసేందుకు అవకాశం దక్కకపోవడంతో గందరగోళం చెలరేగింది. చివరికి పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా అక్షరాసింగ్ టీవీ నటిగా కెరియర్ ప్రారంభించి, ప్రస్తుతం భోజ్‌పురిలో విజయవంతమైన నటిగా కొనసాగుతున్నారు.