ఏలూరు: గ్యాంగ్‌లీడర్‌ సినిమా శత దినోత్సవం ఏలూరులో జరగడానికి కారణం ఏమిటి..? ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రులో మూడు సినిమాలు తీయడానికి కారణం ఏమిటి..? ఒకే ఒక్క కారణం. ఆ సినిమాల దర్శకుడు విజయబాపినీడు కావడమే. కన్నతల్లిని.. జన్మభూమిని మర్చిపోకూడదనుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు. అందుకే విజయవంతమైన దర్శకుడిగా మారిన తరువాత తన ఊరును తన కెమెరా కళ్లతో దేశమంతా చూపించారు. తన ఊరుపై మమకారాన్ని చాటుకున్నారు. అందుకే గుత్తా విజయ బాపినీడు మా ఊరు వారని ఆ గ్రామస్థులంతా గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి పెద్దాయన ఇక లేరని.. తిరిగిరారని తెలిసి గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి చూసుకునేందుకు బంధువులు, అభిమానులు హైదరాబాద్‌ తరలివెళ్లారు.
ప్రముఖ దర్శక నిర్మాత గుత్తా విజయ బాపినీడు (86) మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో స్వగ్రామమైన ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1936 సెప్టెంబర్‌ 22న సీతారామస్వామి, లీలావతి దంపతులకు విజయ బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో బీఏ చదివారు. తరువాత వైద్య ఆరోగ్యశాఖలో, భీమడోలు పంచాయతీ కార్యాలయంలో అధికారిగా పనిచేసి సినీ రంగంపై ఆసక్తితో ఉద్యోగ విరమణ చేశారు. సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లిపోయారు. అక్కడ విజయ మ్యాగ్జయిన్‌ స్థాపించి కొంతకాలం విజయవంతంగా నిర్వహించారు. తరువాత బొమ్మరిల్లు పుస్తకానికి సంపాదకుడిగా వ్యవహరించారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే అగ్రదర్శకుడిగా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవి, శోభన్‌బాబు, మోహన్‌బాబులతో విజయవంతమైన సినిమాలు తీశారు.
దర్శకుడిగా పరిచయంతోనే మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో లాంటి వరుస విజయాలతో కమర్షియల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌లాంటి కామెడీ హీరోలతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. తెలుగులో 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరి చిత్రం 1998లో కొడుకులు చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్‌ చిత్రాలకు బాపినీడు పెట్టింది పేరు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబర్‌ 786, మగధీరుడు, గ్యాంగ్‌ లీడర్‌ బాక్సాఫీస్‌ హిట్‌లు సాధించాయి. అంతేకాకుండా పుట్టిన ఊరుపై ఉన్న మమకారంతో బొట్టు కాటుక, విజయ, వారాలబ్బాయి వంటి సినిమాలు చాటపర్రులో చిత్రీకరించారు. తన ఉన్నతికి కారణమైన ఏలూరులో గ్యాంగ్‌ లీడర్‌ శత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సినిమాల్లో బిజీ అయిన తరువాత స్వగ్రామానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం చాటపర్రులో ఆయన ఇల్లు శిథిలమైంది.
బాధాకరం : గుత్తా బాబ్జీ, బంధువు
సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. ఆయన మరణం బాధాకరం. చాటపర్రు గ్రామంపై అభిమానంతో ఇక్కడే మూడు సినిమాలు తీశారు. గ్రామంలో యువకులను తీసుకెళ్లి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎప్పుడు వెళ్లినా ఊరు గురించి అడిగేవారు.
మెగా దర్శకుడు : కాశీబాబు, బంధువు
30 ఏళ్ళ పాటు సినిమా ఇండస్ట్రీలో విజయబాపినీడు కొనసాగారు. చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు వచ్చేలా అసలైన బీజం వేసి దర్శకుడు. ఆయన అందరి బంధువు. చాటపర్రులో పుట్టి, పెరిగి గ్రామానికి కీర్తి తెచ్చారు. ఆయన మృతి బాధాకరం.
 
తీరని లోటు : రామచంద్రరావు
ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి చాటపర్రు గ్రామానికి విశిష్ట స్థానానికి తీసుకువచ్చారు. చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. ఆ అనుబంధంతో చిరంజీవితో ఏడు సినిమాలు చేశారు. నన్ను కూడా సినీ ఫీల్డ్‌కు పరిచయం చేశారు. ఆయన లోటు తీరనిది. మాస్‌ అభిమాన దర్శకుడు. విజయ బాపినీడుతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఎంతో అభిమానంగా పలకరించేవారు. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సినిమాలు ఉషాపిక్చర్స్‌ ద్వారా పంపిణీ చేశా. బాపినీడు లాంటి మంచి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఇండస్ర్టీలో అందరూ బాగుండాని అనుకునే వ్యక్తి. ఆయన మృతి బాధాకరం. చాలా సౌమ్యంగా ఉండేవారు. సినిమాలు చూస్తే మాత్రం చాలా రఫ్‌గా ఉండేవి.
మాస్‌ అభిమాన దర్శకుడు: ఉషా బాల కృష్ణారావు, జిల్లా ఫిలిం డిస్ర్టిబ్యూషన్‌
25 సినిమాలకు అసిస్టెంట్‌గా చేశా.సినీ ఇండస్ట్రీలో ఇటువంటి మంచి వ్యక్తిని చూడలేదు. అందరి క్షేమం కోరే వ్యక్తి బాపినీడు. ఆయన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 25 సినిమాలు చేశా. ఒక సినిమా కోసం 24 గంటలూ కష్టపడేవారు. నలుగురితో చర్చించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. పక్కా ప్రణాళికతో బడ్జెట్‌ అంచనాతో సినిమా తీసేవారు. ప్రొడ్యూసర్‌కు లాభాలు అందించే డైరెక్టర్‌గా పేరుగడించారు.అటువంటి మంచి వ్యక్తి మన మధ్యలేకపోవడం తీరనిలోటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here