కొన్ని రోగాలకే పరిమితమవుతున్నారు: పల్లె
1,046 రోగాలకు వైద్యం అందిస్తున్నాం: ఫరూక్‌
‘మధ్యాహ్న’ ఉద్యోగులను తొలగించం: గంటా

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):ఎన్టీఆర్‌ వైద్యసేవలో కేన్సర్‌ లాంటివి తప్ప హైదరాబాద్‌లో ఇతర రోగాలకు వైద్యం అందించడం లేదని చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిలో అధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రులు ఉన్నందున రాష్ట్రంలోని రోగులు అక్కడ వైద్యం చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అయితే, హైదరాబాద్‌లో కేన్సర్‌, చిన్నపిల్లల వైద్యం తప్ప ఇంకేవీ చేయడం లేదన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను పోషిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. బడ్జెట్‌లో రూ.8,463 కోట్లు కేటాయించి 6,428 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన 2 వేల కోట్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ బిల్లులు చెల్లిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. మంత్రి ఫరూక్‌ సమాధానమిస్తూ ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 1,046 రోగాలకు వైద్యం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచామని, వచ్చే ఏప్రిల్‌ నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. 88 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

నిపుణులు చెప్పింది రూ.లక్ష.. సీఎం ఇచ్చింది లక్షన్నర
రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.లక్ష వరకు ప్రభుత్వం చెల్లించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తే సీఎం చంద్రబాబు రూ.లక్షన్నర చెల్లించేందుకు సిద్ధపడ్డారని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీకి ఇప్పటికే రూ.24 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 55.65 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్నారు.

ఎవరికీ సామ్రాజ్యాలు లేవు!

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు విశాఖపట్నంలోని తన నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి స్థలం లేదని, ప్రభుత్వం మంజూరు చేసినా పొరుగు నియోజకవర్గం భీమిలిలో స్థలం కేటాయించడంలేదన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన సామ్రాజ్యంలోకి రానివ్వడంలేదన్నారు. దీనికి మంత్రి గంటా బదులిస్తూ ‘ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ఎవ్వరికీ సామ్రాజ్యాల్లేవు. ఆ విషయం బీజేపీ సభ్యుడు తెలుసుకోవాలి’ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఉద్యోగులను తొలగించబోమని గంటా హామీ ఇచ్చారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే 3 చక్రాల మోటారు వాహనాన్ని 45 ఏళ్ల వయసు వరకు ఇచ్చేలా నిబంధనలు సడలించినట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here