350కి పైగా శస్త్రచికిత్సలు ఉచితంగానే

12-02-2019: ఆయనో గొప్ప హృద్రోగ చికిత్స నిపుణుడు.. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో పట్టా పొందిన వైద్యుడు.. డబ్బే ముఖ్యం అనుకొని ఉంటే కోట్లు సంపాదించేవాడు.. ఆయన అవేమీ కోరుకోలేదు. తండ్రి చూపిన బాటలో పయనిస్తూ, పదిమందికి సేవ చేస్తూ పూణెకు చెందిన డాక్టర్‌ మనోజ్‌ దురైరాజ్‌ పేదల గుండెల్లో చిరస్మరనీయుడయ్యారు. 14 ఏళ్లలో 350కి పైగా గుండె సర్జరీలు ఉచితంగానే చేసి తనలోని మానవీయతను చాటుకున్నారు. తన తండ్రి నెలకొల్పిన మరియన్‌ కార్డియాక్‌ సెంటర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో 2005 నుంచి సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రలోనే కాకుండా అహ్మదాబాద్‌లో ఓ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలోనూ రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల స్పెషలిస్టుగా పేరుగాంచారు.

తండ్రి కూడా కార్డియాలజిస్టే..
మనోజ్‌ తండ్రి డాక్టర్‌ మాన్యుయేల్‌ దురైరాజ్‌ కూడా కార్డియాలజిస్టే. 21 ఏళ్ల పాటు ఆర్మీకి సేవలు అందించారు. రాష్ట్రపతులు ఎన్‌. సంజీవరెడ్డి, ఆర్‌ వెంకట్రామన్‌, జైల్‌ సింగ్‌లకు ఫిజీషియన్‌గా పని చేశారు. రూబీ హాల్‌ క్లినిక్‌లో ఆయన కార్డియాలజీ డిపార్టుమెంటును ప్రారంభించారు. 1991లో మరియన్‌ ఫౌండేషన్‌ను స్థాపించి, పేదలకు సేవ చేశారు. తన తండ్రి చూపిన దారిలోనే తానూ వెళ్తున్నానని, ఆయన తన సమయాన్ని, డబ్బును పేదల చికిత్స కోసం ఖర్చు చేశారని, డబ్బుల్లేక వైద్యానికి ఎవరూ దూరం కావొద్దన్నదే ఆయన లక్ష్యమని.. దాన్ని తాను నెరవేరుస్తున్నానని మనోజ్‌ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here