మూలకణాలతో ఎలుకల్లో కిడ్నీల అభివృద్ధి..

త్వరలో మానవ మూత్రపిండాలూ తయారీ
 
టోక్యో, ఫిబ్రవరి 6: అవయవాల కొరతకు త్వరలో స్వస్తి పలకనున్నామా? మనుషులకు అవసరమయ్యే అవయవాలను సమీప భవిష్యత్తులో పందులు, గొర్రెల్లో తయారు చేసుకోబోతున్నామా? అంటే అవుననే చెబుతోంది తాజా పరిశోధన. ఎలుకల్లో ఒక రకమైన మూలకణాలతో మూత్రపిండాలను పెంచి జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైకలాజికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు.
అవయవ దాతలు తక్కువ.. అవసరం ఎక్కువ.. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ కన్నుమూసిన గ్రహీతలెందరో! ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్నది మూత్రపిండాల సమస్యనే. కిడ్నీ మార్పిడి చేస్తేనే ఎక్కువ కాలం బతకగలమన్న ధీమా. అవి దొరక్క ఎంతోమంది శస్త్రచికిత్సకు దూరంగానే ఉంటున్నారు. ఒక్క అమెరికాలోనే 95వేల మంది గ్రహీతలు కిడ్నీల కోసం అర్థిస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కొత్త రూపునిస్తూ జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైకలాజికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మూల కణాలతో ఎలుకల్లో కిడ్నీలను విజయవంతంగా పెంచగలిగారు. వాటి పనితీరు కూడా ఆశాజనకంగా ఉందని గుర్తించారు. కేవలం మనుషుల మూలకణాలతోనే మరో ప్రమేయం లేకుండా అవయవాల అభివృద్ధికి ఈ పరిశోధన దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పందులు, గొర్రెల్లో మానవ అవయవాలు
మానవ అవయవాలు తయారు చేయాలంటే.. సరైన పరిమాణంలో ఉండే అవయవాలు కలిగే జీవాలు అయ్యి ఉండాలి. అందుకు పందులు, గొర్రెలే సరైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే వీటి అవయవాలు, దాదాపు మనిషి అవయవాల పరిమాణంలోనే ఉంటాయి.
మూల కణమే మూలం..
సరైన రసాయనిక పద్ధతులతో మూల కణాన్ని ఏ రకమైన కణజాలంగానైనా మార్చవచ్చు. అయితే, లోపాలు లేని అవయవం అభివృద్ధి చేయడం కష్టసాధ్యం. పైగా, నిజమైన అవయవాన్ని పోలి, అదే పరిమాణంలో ఉండాలి. దానికోసం శాస్త్రవేత్తలు ప్యూరిపోటెంట్‌ మూలకణాలను సేకరించి, బ్లాస్టోసైట్స్‌ సహాయంతో గర్భస్థ పిండాన్ని కలిగిన ఎలుకల్లో ప్రవేశపెట్టగా కిడ్నీల పెరుగుదల ప్రారంభమైంది. నెఫ్రాన్‌, పోడోసైట్స్‌, వంపులు తిరిగే సన్నిహిత గొట్టం, టీడీఎల్‌, టీఏఎల్‌ గొట్టాలు, రక్తనాళం, వాహిక అభివృద్ధి చెందాయి. ఆ కిడ్నీని పరిశీలించగా మూత్రం వడపోత, సరఫరా సాఫీగా ఉన్నట్లు తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here